జమ్మూ కశ్మీర్‌ కు రాష్ట్ర హోదానే ఎజెండా

2024-10-09 12:35:08.0

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా

https://www.teluguglobal.com/h-upload/2024/10/09/1367670-omar-abdullah-new.jfif

జమ్మూ కశ్మీర్‌ కు మళ్లీ రాష్ట్ర హోదా సాధించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ రాష్ట్రానికి కాబోయే సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌ లో తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసి ప్రధాని నరేంద్రమోదీకి పంపిస్తామన్నారు. జమ్మూకశ్మీర్‌ ను ఢిల్లీతో పోల్చవద్దని విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదని అన్నారు. కశ్మీర్‌ కు రాష్ట్ర హోదా పునరుద్దరిస్తామని ప్రధాని, కేంద్ర హోం మంత్రి సహా కేంద్ర ప్రభుత్వంలోని పలువురు సీనియర్‌ మంత్రులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2019 వరకు జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంగానే ఉందని, ఇప్పుడు అదే హోదా కావాలని అడుగుతున్నామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌ లో శాంతి నెలకొల్పడం, అభివృద్ధి తప్పనిసరి అన్నారు. కశ్మీర్‌ లోని కొన్ని పార్టీలను బీజేపీ బలహీన పరచడానికి తీవ్రంగా ప్రయత్నించిందన్నారు. కానీ ఆ పార్టీ ఎత్తులు ఫలించలేదని తెలిపారు. పార్టీ చీఫ్‌ ఒమర్‌ అబ్దుల్లా కాబోయే ముఖ్యమంత్రి తానే అని ప్రకటించినా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ శాసనసభ సమావేశంలో చర్చించి, మిత్రపక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం 2019లో ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయింది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూకశ్మీర్‌ ను కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ డిమాండ్‌ చేస్తోంది. 

Jammu and Kashmir,Statehood,National Conference,Omar Abdullah