ఆ సమయానికి బందీలను విడుదల చేయకపోతే…

2025-02-12 01:13:59.0

హమాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు హమాస్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. బందీలను ఈ శనివారం మధ్యాహ్నంలోపు విడుదల చేయాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ముగింపు పలుకుతామని హెచ్చరించారు. బందీలను విడుదల చేయకపోతే హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేవరకు తమ బలగాలు పోరాడుతాయన్నారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. గాజా లోపల, వెలుపల బలగాలను సమీకరించాలని ఐడీఎఫ్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 15న మరింతమంది బందీలను విడుదల చేయాలని హమాస్‌ మొదట నిర్ణయించింది. కానీ ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని, అందుకే తాము బందీల విడుదలను ఆపేస్తామని హమాస్‌ స్పష్టం చేసింది. అంతేగాకుండా పాలస్తీనా పౌరులను గాజాలోకి రాకుండా ఆలస్యం చేస్తున్నదని, స్ట్రిప్‌లోకి ప్రవేశించకుండా మానవతా సాయాన్ని నిలిపివేసిందని ఆసంస్థ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే హమాస్‌ను నెతన్యాహు హెచ్చరించారు.

మరోవైపు బందీల విడుదల ఆలస్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా హమాస్‌కు డెడ్‌లైన్‌ విధించిన విషయం విదితమే. శనివారం నాటికి బందీలందరినీ విడుదల చేయాలని లేకపోతే నరకం చూపిస్తానంటూ హమాస్‌ను హెచ్చరించారు. 

Israeli Prime Minister Benjamin Netanyahu,gave a warning to Hamas,Hostages not returned,On Saturday,Gaza ceasefire will end