2025-01-15 13:00:09.0
కీలకమైన గ్యాస్, ఎరువుల సరఫరా కేంద్రాలే లక్ష్యంగా చేసుకొని మాస్కోకు చెందిన ఏడు టీయూ-22, ఆరు టీయూ-95 స్ట్రాటజిక్ బాంబర్లు బాంబు దాడులు
పోలాండ్ సరిహద్దుల్లో ఉక్రెయిన్‌పై రష్యా నేడు భీకర దాడి చేసింది. కీలకమైన గ్యాస్, ఎరువుల సరఫరా కేంద్రాలే లక్ష్యంగా చేసుకొని మాస్కోకు చెందిన ఏడు టీయూ-22, ఆరు టీయూ-95 స్ట్రాటజిక్ బాంబర్లు బాంబు దాడులు చేశాయి. పోలాండ్ సరిహద్దుకు అత్యంత సమీపంలో రష్యా క్షిపణులు పడ్డాయి. దీంతో నాటో దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఫైటర్ జెట్ విమానాలు గాల్లోకి ఎగిరాయి. నేలపై ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని నాటో ఆపరేషనల్ కమాండ్ హెడ్‌క్వార్టర్ నుంచి ప్రకటన వెలువడింది.
ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మొత్తం 40 క్షిపణుల్లో 30ని నేల కూల్చినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. వీటికి అదనంగా మరో70 అటాక్ డ్రోన్లు కూడా దాడి చేశాయన్నారు. నాటో సదస్సులో మిత్ర దేశాలు ఇచ్చిన హామీలు ఇంకా కొన్ని అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. ఎయిర్ డిఫెన్స్ ల సరఫరాను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఉక్రెయన్ నేషనల్ గ్రిడ్‌లో సమస్యల కారణంగా ఆరు ప్రదేశాల్లో అత్యవసర కరెంటు కోతలు విధిస్తున్నారు.
నిన్న రష్యాపై ఉక్రెయిన్ చేసిన దాడికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బ్రిటన్ తయారీ స్ట్రామ్ షాడో, అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్‌లను కీవ్ వాడుతుండటంతో మాస్కో దళాలు ఇబ్బంది పడుతున్నాయి. మంగళవారం సుమారు 14 క్షిపణులు, 200 డోన్లతో రష్యాపై విరుచుకుపడింది. కెమికల్ ఫ్యాక్టరీలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొన్నాయి. తాము 2 మిలియన్‌డాలర్ల విలువైన స్ట్రామ్ షాడో క్షిపణులను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది.
NATO warplanes are scrambled,Putin launches huge attack,Near Poland border,Tu-22 and Tu-95 strategic bombers,Ukraine