ఆ 11 మంది రేపిస్టుల విడుదల న్యాయాన్ని అపహాస్యం చేసింది… US ప్యానెల్ ప్రకటన‌

2022-08-20 11:33:09.0

బిల్కిస్ బానో కేసులో అత్యాచారం, హత్యల‌కు పాల్పడిన 11 మంది వ్యక్తులను జైలు నుంచి విడుదల చేయడాన్ని యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) తీవ్రంగా ఖండించింది. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే అని USCIRF కమిషనర్ స్టీఫెన్ ష్నెక్ అన్నారు.

గుజరాత్ లో 11 మంది రేపిస్టులను ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడం పట్ల దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ 11 మందిని మళ్ళీ జైలుకు పంపాలంటూ 6 వేల మంది పౌరులు సుప్రీంకోర్టుకు లేఖ రాయగా తాజాగా యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) ఈ విషయంపై స్పందించింది. బిల్కిస్ బానో కేసులో అత్యాచారం, హత్యల‌కు పాల్పడిన 11 మంది వ్యక్తులను జైలు నుంచి విడుదల చేయడాన్ని శుక్రవారం ఖండించింది.

”ఈ నిర్ణయం అన్యాయమైనది. మతపరమైన మైనారిటీలపై హింసకు పాల్పడే వారి పట్ల భారతదేశం ఏ విధంగా వ్యవహరిస్తోందో ఈ ఘటన రుజువుచేస్తున్నది” అని USCIRF పేర్కొన్నది.

శుక్రవారం, USCIRF కమిషనర్ స్టీఫెన్ ష్నెక్ మాట్లాడుతూ, దోషుల శిక్షలను తగ్గించడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అన్నారు.

మార్చి 3, 2002న గుజరాత్ మత దాడుల‌ సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అప్పుడు ఆమె వయస్సు 19 ఏళ్ళు. ఆ సమయంలో ఆమె గర్భవతి. అహ్మదాబాద్ సమీపంలో మతోన్మాదుల‌ దాడిలో ఆమె మూడేళ్ల కుమార్తెతో సహా ఆమె కుటుంబంలోని 14 మంది సభ్యులను హత్య చేశారు. వారిలో ఒక వ్యక్తి బాలికను ఆమె తల్లి చేతుల్లోంచి లాక్కొని బాలిక‌ తలను బండరాయిపై మోది పగలగొట్టాడు.

2002 అల్లర్లలో 2,000 మందికి పైగా మరణించారు, మృతుల్లో ఎక్కువ మంది ముస్లింలు.

గుజరాత్ ప్రభుత్వం తమ రిమిషన్ పాలసీ ప్రకారం శిక్షలను తగ్గించాలని చేసిన దరఖాస్తును ఆమోదించడంతో దోషులు సోమవారం గోద్రా జైలు నుంచి విడుదలయ్యారు.

ఖైదీల విడుదల కోసం గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ సిఫార్సు ఆధారంగా వీరి విడుదల జరిగింది. ప్యానెల్‌లోని పది మంది సభ్యులలో ఐదుగురు భారతీయ జనతా పార్టీలో ఆఫీస్ బేరర్లు. వీరిలో ఇద్దరు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

అత్యాచారం, హత్య కేసులో ఆ 11 మందికి జీవిత ఖైదు విధించిన ముంబై ట్రయల్ కోర్టు అభిప్రాయానికి వ్యతిరేకంగా గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

United States Commission on International Religious Freedom,Bilkis Bano,gujarat,Unjustified