మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ ఫైర్‌

 

2024-10-03 05:28:43.0

https://www.teluguglobal.com/h-upload/2024/10/03/1365563-cine-industry.webp

రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, ,నాగార్జున పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై సినీ ఇండస్రీ మండిపడుతున్నది. ఈ క్రమంలోనే నటులు వెంకటేశ్‌, అల్లు అర్జున్‌, మంచు విష్ణు తాజాగా మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.

రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం: వెంకటేశ్‌

వెంకటేశ్‌ స్పందిస్తూ .. ‘ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి.. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వ్యక్తిగత జీవితం, కళల పట్ల పరస్పర గౌరవం, హార్డ్‌వర్క్‌, అంకితభావంతో మా సినీ పరిశ్రమ ఏర్పడింది. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉన్నది. రాజకీయాల్లోకి ఇతరుల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇందులోభాగమైన వారి కుటుంబానికి బాధ మాత్రమే ఉంటుంది. అటువంటి ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం, సానుభూతి పాటించాలని కోరుతున్నారు. మీ చర్యలు, మాటలు స్ఫూర్తి నింపేలా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ స్పందిస్తూ.. ‘సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉన్నది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా.మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలని’ అని పేర్కొన్నారు.

మాకూ గౌరవం, రక్షణ అవసరం: మంచు విష్ణు

సినీ పరిశ్రమలోని వ్యక్తుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఖండించారు. ‘ఇటీవలి దురదృష్టకరమైన వ్యాఖ్యల కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. అసత్య కథనాలను, రాజకీయలాభాల కోసం వాడటం చాలా నిరాశ కలిగిస్తున్నది. మేం నటులుగా ప్రజల దృష్టిలో ఉంటాం. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకూ గౌరవం, రక్షణ అవసరం’ అని విష్ణు వ్యాఖ్యానించారు.

ఈ వివాదంపై మంత్రి కొండా సురేఖ హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. నా నోటి నుంచి అనుకోకుండా ఓ కుటుంబం పేరు వచ్చింది. మరొకరిని నొప్పించాలని తెలిసి చాలా బాధపడ్డాను. అందుకే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాను అన్నారు.

 

Samantha,Naga Chaitanya,Nagarjuna,Konda Surekha,Chiranjeevi,Venkatesh,Allu arjun,Manchu vishnu