2016-05-22 02:02:29.0
ఆడవారి హ్యాండ్ బ్యాగంటే వారిదైన ఓ బుల్లి ప్రపంచం. హ్యాండ్ బ్యాగుని చూసి ఆ మహిళ మనస్తత్వం, జీవన శైలి గురించి కాస్తయినా చెప్పవచ్చు. హ్యాండ్ బ్యాగ్ గురించి మరికాస్త ఎక్కువే చెబుతోంది చైనా వారి వాస్తు ఫెంగ్‌షుయ్. హ్యాండ్ బ్యాగు కొనుగోలు, నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఈ వాస్తు విధానం పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఇందులోని వాస్తవాలను గురించి పక్కనపెడితే ఈ విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి… ఆ వివరాలు మీకోసం– –హ్యాండు […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/handbag1.gif
ఆడవారి హ్యాండ్ బ్యాగంటే వారిదైన ఓ బుల్లి ప్రపంచం. హ్యాండ్ బ్యాగుని చూసి ఆ మహిళ మనస్తత్వం, జీవన శైలి గురించి కాస్తయినా చెప్పవచ్చు. హ్యాండ్ బ్యాగ్ గురించి మరికాస్త ఎక్కువే చెబుతోంది చైనా వారి వాస్తు ఫెంగ్‌షుయ్. హ్యాండ్ బ్యాగు కొనుగోలు, నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఈ వాస్తు విధానం పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఇందులోని వాస్తవాలను గురించి పక్కనపెడితే ఈ విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి… ఆ వివరాలు మీకోసం–
–హ్యాండు బ్యాగులను ఎప్పుడూ నేలకు ఆనించి ఉంచకూడదట. చాలామంది ఆడవాళ్లు రెస్టారెంట్లు, వాష్ రూముల్లో వాటిని నేలకు ఆనేలా పెడుతుంటారని, అది తప్పని చెబుతున్నారు ఫెంగ్‌షుయ్ నిపుణులు. హ్యాండ్‌బ్యాగులను తలుపులకు ఉన్న కొక్కేలకు తగిలించి ఉంచాలట.
–ప్రతి పనికిరాని పేపరుని హ్యాండ్‌బ్యాగులో కుక్కేస్తుంటారు చాలామంది. అలాగే డస్ట్‌బిన్‌లో వేయాల్సిన చాక్లెట్ రేపర్స్, టాష్యూ కాగితాల వంటివాటిని కూడా బ్యాగులో పడేస్తుంటారు…అలా చేయవద్దంటున్నారు ఈ వాస్తు నిపుణులు. అలా చేస్తే మనం డబ్బుని చెత్తనీ ఒకే చోట ఉంచినట్టు అవుతుందట.
–చిల్లరని హ్యాండ్‌బ్యాగులో అలాగే పడేయకుండా దానికి ప్రత్యేకంగా హ్యాండ్బ్యాగులోని ఒక ప్యాకెట్‌ని వాడాలి. ఎందుకంటే చిల్లరని బ్యాగులో అలాగే పడేస్తే అవి బ్యాగు అడుగు భాగానికి చేరతాయి. అది కూడా డబ్బుని అగౌరవపరచినట్టు అవుతుంది.
–హ్యండు బ్యాగులో ఎప్పుడూ పనికొచ్చే వస్తువులు ఉండాలి. సేఫ్టీ పిన్, పళ్లను శుబ్రంచేసుకోవడానికి ఉపయోగించే డెంటల్ ఫ్లాసర్ , ఒక చిన్ననోట్ప్యాడ్, పెన్ను, చిన్న ప్యాకెట్ నైఫ్…లాంటివి అందులో ఎప్పుడు సిద్ధంగా ఉండాలి.
–ఫెంగ్ షుయ్ ప్రకారం అదృష్టాన్ని అందించే చిన్నపాటి ఫెంగ్‌షుయ్ హ్యాంగర్లను హ్యాండ్ బ్యాగుల్లో ఉంచుకుంటే అవి అదృష్టాన్ని తెచ్చిపెడతాయట.
–కంపెనీ బట్టి కాదు, కంఫర్ట్‌ని బట్టి హ్యాండ్‌బ్యాగుని కొనాలి. అందులో చిన్న చిన్న అరలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది.
–బ్యాగులోపల తాళాలు తగిలించుకునేందుకు వీలుగా చిన్నపాటి హుక్‌లు ఉండాలి. అప్పుడు బ్యాగులోంచి తాళాలను వెతకటం తేలిక. హ్యాండ్ బ్యాగులోంచి ఎంత తేలికగా తాళాలను తీయగలిగితే అంత తేలికగా డబ్బుసంపాదించే మార్గాలను వెతకగలుగుతారట.
–హ్యాండు బ్యాగులో ఒక పర్సుని ఉంచుకుని డబ్బుని అందులో పెట్టుకోవాలి. ఆ పర్సు చాలా అరలుగా ఉండాలి. డబ్బు పెట్టుకోవడానికి పెద్ద అరని, క్రెడిట్, డెబిట్ కార్డులను పెట్టుకోవడానికి చిన్న అరలను ఉపయోగించాలి.
–వ్యక్తిగతంగా మీకు కలిసొచ్చే రంగులో హ్యాండ్ బ్యాగు ఉండటం మంచిది. అలా కాకపోతే ఎరుపు, తెలుపు, నలుపు, నీలం, మెటాలిక్ రంగుల బ్యాగులను ఎంపిక చేసుకోవచ్చు.
–బ్యాగులను ఎప్పుడూ ఇతరుల సెలక్షన్‌తో కాకుండా మీకేది నచ్చుతుందో అది మాత్రమే కొనండి అని చెబుతుంది ఫెంగ్‌షుయ్. హ్యాండ్‌బ్యాగుని అంతగా మనసుపడి కొనుక్కుంటేనే దాని శుభ్రత పట్ల శ్రద్ధపెట్టగలుగుతారని ఈ వాస్తు నిపుణులు చెబుతున్నారు.