మౌక్తికాలు (కవిత)

2023-12-02 15:58:46.0

https://www.teluguglobal.com/h-upload/2023/12/02/865750-nr-tapasvi.webp

కనుల కద్దుకొనగల

రసికావతంసు డుంటేనే

‘కర్పూర వసంత రాయ’

కావ్యానికి విలువ!

కట్టుకొని ప్రదర్శించే

కమలనయన ఉంటేనే

కంచి పట్టుచీర

పైటగాలిలోన ౘలువ!

తల్లి వోలె చెల్లి వోలె

ద్రాక్షా ప్రియవల్లి వోలె

పురుషుని ఆలన పాలన

పూరించును చెలువ!

అమాయికలుగా తోచే

అమ్మాయిల లొంగదీసి

బొంబాయికి అమ్మివేసి

బోర విరుచు తులువ!

పలుకు వెలది పజ్జ నిలిచి

సలహాలందిస్తేనే

జీవకోటి నింపుగా సృ

జింౘ గలడు నలువ!

మూడు కోట్ల దేవతలకు

ముడుపు కట్టి మొక్కుతోంది

సినిమా నటి ఒడలి మీది

చిట్ట చివరి వలువ!

పరులకు సాయము సేయగ

విరమించకుమో ‘తపస్వి!’

ఎవరి జీవితం వారికి

ఎత్త లేని ‘సిలువ!!’

– ఎన్ .ఆర్ .తపస్వి ( చెన్నై)

NR Tapasvi,Telugu Kavithalu