2023-10-11 13:03:56.0
https://www.teluguglobal.com/h-upload/2023/10/11/839045-e-manish.webp
నిదానమే ప్రధానం అంటాడు గానీ
ట్రాఫిక్ లో ఎప్పుడూ నిదానించడు.
సత్యమేవ జయతే అని పలకడానికే…
ఇంట్లో పిల్లలకు ‘ఎవరన్నా వస్తే నాన్న లేడని చెప్పమంటూ’పచ్చిఅబద్ధాలు మప్పుతాడు…!
చట్టబద్ధమైన హెచ్చరికతో
మొదలైన చిత్ర విరామంలో
పొగచుట్ట తగలెట్టి వస్తాడు…!
అవినీతికి అడ్డుకట్ట వేయాలని
గ్రూపులో చర్చలు సాగిస్తూ…
ప్రభుత్వ ఆఫీసులో మాత్రంఉద్యోగి
చేయి పక్కాగా తడిపి
పని జరిపించు కుంటాడు..!
స్త్రీ జనోర్ధరణ మీద కవిత చదివి
‘చప్పట్లు కొట్టించుకుని ‘ వస్తూ..
బస్సులో వారికి కేటాయించిన సీటులో సిగ్గుపడకుండా కూర్చొని దర్జాగా ప్రయాణిస్తాడు…!
మానవత్వం మృగ్యం అవుతోందని…ఉత్తుత్తి నిట్టూర్పులు విడుస్తూ
కళ్ళ ముందు జరిగిన ప్రమాద
దృశ్యాన్ని తీరుబడిగా
చరవాణిలో చిత్రీకరిస్తాడు…!
-యన్.కే.నాగేశ్వరరావు.
(పెనుగొండ)
YK Nageswara Rao,Telugu Kavithalu