సాక్ష్యం ( కవిత)

2023-08-21 18:17:29.0

https://www.teluguglobal.com/h-upload/2023/08/21/813578-saksham.webp

మౌనం స్పృశిస్తున్న

గత గాయాల శబ్దాలు

ఊపిరి లయలో

ఎగిసిపడుతుంటే

అసంకల్పిత చర్యగా

సడిచేయని దుఃఖం

అశ్రుపాతమై ప్రవహిస్తుంది!

శూన్యం తెరమీద

ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్న

వాస్తవ దృశ్యాలు

మెలకువగానే అచేతనుడ్ని చేస్తున్నప్పుడు

కలల వాకిటపై దిగులు మబ్బు

మౌనంగానే రోదిస్తుంది!

గిర్రున తిరుగుతున్న

అనుభవాల గోళం

జీవిత పయనంలో

కుదుపుతో ఆగినప్పుడల్లా

ప్రతీ శబ్దం ఒక హెచ్చరికే అవుతుంది!

ఏదేమైనప్పటికీ

గమనం ఒక చరిత్రకు

సాక్ష్యం!

-పి.లక్ష్మణ్ రావ్

P Laxman Rao,Telugu Kavithalu,Saksham