చరిత్ర

2023-07-02 14:46:09.0

https://www.teluguglobal.com/h-upload/2023/07/02/790677-cherithra.webp

రాజుగారు చెప్పినదే

కాదు కదా చరిత్ర,

రాజుకున్న జీవితాల

రక్తఘోష చరిత్ర..

రాణిగారి ప్రేమకథల

సమాధులా చరిత్ర?

రాళ్ల క్రింద దాగి ఉన్న

రహస్యాలు చరిత్ర..

గెలిచిన చేత్తో కొట్టిన

డప్పు కాదు చరిత్ర,

గెలుపు-ఓటముల మధ్య

సంఘర్షణ చరిత్ర..

తప్పొప్పుల పట్టిక మరి

కాదు కదా చరిత్ర,

తరతరాల విప్లవాల

తెగనిధార చరిత్ర..

అగ్గిలోనపోస్తే ఇక

బుగ్గి కాదు చరిత్ర,

ఆవహించి దహిస్తుంది

అణువణువును చరిత్ర..

తెంపరితనాన్ని నిత్యం

సహించదుగ చరిత్ర,

తన కథలను తానె తిరిగి

వ్రాసుకొనును చరిత్ర..

అబద్ధానికనవరతం

పట్టంకట్టదు చరిత్ర,

అసలు సిసలు సత్యాన్ని

త్రవ్వితీయు చరిత్ర..

ఆవేశంతో చెరిపితే

చెరిగిపోదు చరిత్ర,

అక్షరాల విస్ఫోటన

జరుపుతుంది చరిత్ర..

కత్తికి భయపడి చావదు

కన్నీళ్లతో చరిత్ర,

పౌరుషాల క్రొత్త పురుడు

పోసుకొనును

– రామ్ డొక్కా (ఆస్టిన్, టెక్సస్)

Ram Dokka,Telugu Kavithalu