2023-05-14 08:53:31.0
https://www.teluguglobal.com/h-upload/2023/05/14/763378-nalo-nuvu.webp
చూపు వెలిగిపోతున్నది నిను చూసిన నయనంలో
ప్రేమ పెరిగిపోతున్నది నిను వలచిన హృదయంలో
నీ బుగ్గల సిగ్గున్నది అరుణోదయ సమయంలో
నీ నీడల మెరుపున్నది చందమామ కిరణంలో
వేల ముళ్ళు దిగుతున్నా పూలస్పర్శలా ఉన్నది
పూలకారు తోడున్నది నిను చేరిన పయనంలో
నిను చూడని రాత్రులలో గడియ గడపలేకున్నా
నన్ను తోసి వెళ్ళిపోకు వేధించే విరహంలో
మేడలొద్దు మిద్దెలొద్దు నీవు నేను ఉండేందుకు
గూడు కట్టుకుందామే సిరివెన్నెల వలయంలో
విరజాజులు మల్లెపూలు స్వాగతాలు చెబుతున్నవి
వెన్నెల విరిసిన రాతిరి మునుగుదాము సరసంలో
చీకటన్నదే లేదని చెప్పగలను “నెలరాజా”
జాబిలిలా వెలుగుతావు నా మానసగగనంలో.
– ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్
Telugu Kavithalu,RV SS Srinivas