2023-02-28 07:33:19.0
https://www.teluguglobal.com/h-upload/2023/02/28/724837-chirunama.webp
పక్క మీద నిశ్చలంగా ఉన్న
అతడి దేహం లోంచి
నిస్సహాయత దుస్సహంగా స్రవిస్తోంది!
కళ్ళలోంచి
ఉబికి వస్తున్న స్వప్నాలను
అతడు పదే పదే తుడుచుకొంటున్నాడు.
అతడి మనసు లోంచి
పొంగి పొర్లుతున్న నిట్టూర్పులతో
గాలి బరువెక్కుతోంది!
బల్లమీది పాత్రలు పాలిపోయి
అతడి కంటే అసహ్యంగా
శుష్కించి పోయాయి!
పరిసరాలు అతడి భవిష్యత్తులా
పరమ మురికిగా ఉన్నాయి!
నిరంతర పశ్చాత్తాప వేదనతో
లోలోతుకు పోయి
జీవకళను కోల్పోయిన
కళ్ళు, బుగ్గలు
పైకి ఎగదన్నుకొచ్చిన
దౌడ ఎముకల క్రింద
మృత్యునీడ
బ్రతుకు అంచున తేలి ఆడుతున్న అతడు!
ఏ కోణం లోంచి చూసినా
అతడి ముఖంలో
బాధా దగ్ధ హృదయం
అతి స్పష్టంగా కనిపిస్తోంది!
అతడి దేహమే
దైన్యానికి అసలు చిరునామా!
-శశికాంత్ శాతకర్ణి
Shashikant Satakarni,Telugu Kavithalu