మూలకు తోసిన మూలకారణాలు (కవిత)

2023-02-01 11:08:39.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/01/721602-chandrakala.webp

ఆడది గీత దాటింది కనుకే

జరిగింది వినాశనం….

ఆడదాని నవ్వే యుద్ధకారకం…

ఆడది కవ్వించింది కనుకే

మనుసంభవం…

ఆడది కయ్యానికి

కాలు దువ్వింది

కనుకే బీభత్సయుద్ధం అంటూ!

మగవాడి రాజ్యకాంక్ష,

ఆధిపత్య ఆకాంక్ష…

అహపు సహజాత లక్షణం…

దుందుడుకుతనం…

కయ్యానికి కాలు దువ్వే తత్వం…

కామంతో కన్ను మిన్ను కానని అంధత్వం….

బంధాలను కానని కరడుగట్టిన స్వార్థం…

మరెన్నో మూలకారణాలను

మూలకు తోసి!

శీలపరీక్షలకు గురిచేసి సీతలను….

పాపపుణ్యాలెరుగని పాంచాలులను…

అమాయక అహల్యలను…

వేలెత్తి చూపుతూ….

వేధింపులకు బలి చేస్తూ!

అరకొర వస్త్రధారణ వల్లే

అఘాయిత్యాలంటూ…

బరితెగించటం వల్లే

బలి అవుతున్నారంటూ…

హద్దులు దాటడం వల్లే

హత్యాచారాలంటూ

అసమర్థ ప్రకటనలతో….

స్వజాతి సమర్థనలతో!

నాటి నుండి నేటివరకు

అభాసుపాలౌతూనే ఉంది ఆడతనం…

అపనిందల పాలౌతూనే ఉంది.

స్త్రీల మానధనం!!!

-చంద్రకళ దీకొండ, (మేడ్చల్)

Chandrakala Deekonda,Telugu Kavithalu