2022-12-10 08:53:18.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/10/430626-renuka.webp
నాకు యుద్ధం అంటే భయం
నా నెత్తిమీద బాంబులు పడతాయని కాదు
నా పర్సులోకి ధరల పురుగులు చేరుతాయని
అరకొరగా వచ్చే జీతాల కింద
గుడ్లు పెట్టీ
పిల్లల్ని కంటాయని భయం
గోధుమ పిండి డబ్బాలోకి
బియ్యం సంచిలోకి
ఇష్టపడి
ఎప్పుడు పడితే అప్పుడు తాగే
టీ డబ్బాలోకి
పిల్లల స్కూటీలో పెట్రోలులోకి కనపడకుండా దూరిపోతాయి
వాటిని ఎలా దులపాలో
ఎల్లాంటి మందు పెట్టాలో తెలియదు
వాటిని మట్టు పెట్టే ప్రయత్నంలో
నాకొచ్చే జీతం…
అలసి ప్రాణాలు పోగొట్టుకుంటుంది
అలసట ప్రాణ భయంతో
రోజు చదివే పేపరులో
నాదేశం ఇవ్వని చదువు కోసం
పరాయి దేశాలు పట్టిన పిల్లల
కన్నీళ్లకి భయపడతాను
నాకు యుద్ధం అంటే భయం
నా జీవితంలో నేను ఇస్టపడే
ప్రకృతిలోకి నిప్పులా వస్తుందని భయం
ఎక్కడో వున్న ఆ యుద్ధ మేఘాలు
రాజకీయం అర్ధంకానీ నాయింట్లో..
తిష్ట వేస్తాయని భయం
నా భయాలన్ని చెప్పుకోవడానికి
నాకే అవకాశం లేదు
నా ఇంటి గుమ్మం వైపు
ఎవరూ చూడరు
నేనొక సామాన్య గృహిణిని
నాకు యుద్ధం అంటే భయం..”!!
-రేణుకా అయోలా
Naku Yuddham Ante Bhayam,Telugu Kathalu,Telugu Kavithalu,Renuka Ayola