https://www.teluguglobal.com/h-upload/2024/11/04/1374584-utsav-dixit.webp
2024-11-04 04:19:10.0
ఈ నెల 1వ తేదీన కేబీఆర్ పార్క్ ప్రహరీ గోడను బద్దలు కొట్టి చెట్టును ఢీకొట్టిన ఘటన బాధ్యుడిగా గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు
పోషే కారు ప్రమాద ఘటనలో స్టాండప్ కమెడియన్ ఉత్సవ్ దీక్షిత్‌ను అరెస్టు చేసినట్లు బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సామల వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 1న తెల్లవారుజామున రెడ్ కలర్ పోషే కారు కేబీఆర్ పార్క్ ప్రహరీ గోడను బద్దలు కొట్టి చెట్టును ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రహరీ గోడ, చెట్టు, ఇనుప గ్రిల్స్ దెబ్బతిన్నాయి. ప్రమాదకారకుడు కారును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. స్థానికులు డయల్ 100కు అందించిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నడిపింది బంజారాహిల్స్ రోడ్ నంబర్ 6లో నివసించే స్టాండప్ కమెడియన్ ఉత్సవ్ దీక్షిత్‌గా గుర్తించి అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అతని డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకుని సెక్షన్ 19 ప్రకారం రద్దు చేయడానికి ఆర్డీవోకు పంపామన్నారు. వాహనంపై నియంత్రణ తప్పి అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
Porsche Crash,At KBR Park,Banjara Hills,Comedian Utsav Dixit,Arrested