2025-03-08 05:42:11.0
https://www.teluguglobal.com/h-upload/2025/03/08/1409546-telangnaa.webp
కేసీఆరే కావాలి.. బీఆర్ఎస్సే భరోసా అంటున్న జనం
తెలంగాణ హక్కులు, ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణతో బీఆర్ఎస్ది పేగు బంధం. తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి పద్నాలుగేళ్లు పోరాటం చేసింది. పదేళ్లు దేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికి అహరహం శ్రమించింది. ఉద్యమనాయకుడి ముందు చూపు, దీర్ఘకాలిక ప్రణాళికలకు తోడు తెలంగాణ సోయి అన్నది రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలో పరుగులు పెట్టించింది. కానీ కుటుంబపాలన అని, ఆధారాలు లేని అవనీతి ఆరోపణలు, నిరుద్యోగులను రెచ్చగొట్టి వారిని మభ్యపెట్టే ప్రకటనలతో అధికారంలోకి వచ్చారు. అందుకే పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్టడమే పాలనగా.. ఇదే మా ప్రభుత్వ విధానంగా రేవంత్‌రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ మాత్రం గంభీరంగానే ఉన్నారు. కొత్త ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని మౌనంగానే చూస్తూ ఉండిపోయారు. ఏ మార్పు కోసం ఓట్లు వేశారో ఆ ప్రజలే మాకు మళ్లీ కేసీఆరే రావాలి అని కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ లోనే కుండబద్దలు కొట్టే స్థితికి రేవంత్‌రెడ్డి సర్కార్ తెచ్చింది.
మాట్లాడితే ఓట్లు, సీట్ల గురించి మాట్లాడే రేవంత్‌రెడ్డి ఇప్పుడు హస్తిన టు హైదరాబాద్ టూర్లు చేస్తున్నారు. కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నిధులు ఇవ్వాలని విన్నవిస్తున్నారు. కానీ కేంద్రంలో కదలిక లేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8, కాంగ్రెస్ 8 సీట్లు గెలిచినా ఏ ప్రయోజనం లేదని తేలిపోయింది. బీజేపీ నమో సిద్ధాంతం. కాంగ్రెస్‌ది కేసీఆర్‌పై విద్వేషం. అంతేగానీ తెలంగాణ ప్రాజెక్టులు, ప్రయోజనాలు, నీటి హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం మరిచిపోయారు. పైగా కాంగ్రెస్ సీఎంపై విమర్శలు చేస్తే బీజేపీ కేంద్ర మంత్రి స్పందిస్తారు. పాపం ఆయన సీటు గుంజుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని కౌంటర్లు ఇస్తారు. ఇవి చూసిన జనాలకు తెలంగాణ ఏం కోల్పోయిందో ఇప్పుడు అర్థమౌతున్నది. లోక్‌సభలో బీఆర్ఎస్కు గుండు సున్నా అని ఎద్దేవా చేస్తున్న రేవంత్ రెడ్డి వల్ల, ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌ల వల్ల పైసా ప్రయోజనం లేదని తెలిసిపోయింది.
ప్రజల కోసం పనిచేసే ఇంటిపార్టీకి ప్రాతినిధ్యం లేకపోతే ఎంత నష్టం జరుగుతుందో పదినెలలుగా ప్రత్యక్షంగా చూస్తున్నది. బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడం రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతున్నది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 230 సీట్లకే పరిమితమైంది. మోడీ 3.0 ప్రభుత్వానికి ఊపిరి టీడీపీ, జేడీయూలే. దీంతో చంద్రబాబు ఏపీకి కావాల్సిన నిధులు సాధించుకుంటూనే అక్కడి కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఇక్కడ విస్తరించే ప్లాన్లను అమలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు తనకు రెండు కండ్లు అంటూనే ఇక్కడి నీళ్లను బహిరంగంగానే ఎత్తుకుపోతున్నారు. కేఆర్ఎంబీ ఏపీ ఏం చెప్తే అదే చేస్తున్నది. ఇలా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అటు కేంద్రం పనిచేస్తుంటే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతో మన హక్కులను కోల్పోవాల్సి వస్తున్నది. ఇప్పుడు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది. అది తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టేలా.. మన హక్కులను కాపాడుకునే ఉండాలి. దానికి నాయకత్వం వహించేది కేసీఆరే. అండగా ఉండేది ప్రజలే.
Telangana State,Rights and benefits in danger,Congress Ruling,Central Government,KCR,BRS,CM Revanth Reddy