2025-01-04 16:03:49.0
గతంలోకి వెళ్తే కేసీఆర్ కుటుంబానికి వెయ్యి సంవత్సరాల జైలు శిక్ష వెయ్యాలే : సీఎం రేవంత్ రెడ్డి
రైతు భరోసా కింద ఒక్కో ఎకరానికి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఒక్కో ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వెసులుబాటును బట్టి గత ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తే తమ ప్రభుత్వం రూ.12 వేలకు పెంచిందని చెప్పారు. వ్యవసాయం చేసే సాగు భూములన్నింటికీ రైతుభరోసా కింద ఒక్కో ఎకరానికి రూ.12 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. రైతుభరోసా అమలులో ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. ”వ్యవసాయ యోగ్యం కాని భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, ప్రభుత్వం సేకరించిన భూములు.. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఇవ్వం.. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారం సేకరించి గ్రామ సభల్లో ప్రజలకు వివరిస్తారు.. రెవెన్యూ రికార్డులు, ధరణిలో లోపాలతో గతంలో ఇలాంటి భూములకు రైతుబంధు నిధులు వచ్చాయి.. వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్న..” అన్నారు.
ప్రభుత్వ ఆదాయం పెంచడం.. పేదలకు పెంచడం తమ విధానం.. వెసులుబాటును పట్టి రైతులకు మేలు చేయాలన్నది తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. గత ప్రభుత్వం అనర్హులకు రూ.22 వేల కోట్ల నిధులను రైతుబంధు రూపంలో ఇచ్చిందని.. అలా కాకుండా చూస్తామని చెప్పారు కదా అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నపై సీఎం స్పందిస్తూ.. ” గతంలోకి వెళ్తే.. వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబం వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.. అందుకే గతంలోకి వెళ్లదల్చుకోలేదు.. మీడియా అనవసరమైన అంశాలకు తావివ్వకుండా రైతులు, ప్రజలకు మంచి చేసే అంశాలకు ప్రాధాన్యమివ్వాలి..” అన్నారు. ”వ్యవసాయం దండగ కాదు పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో అనేక కార్యక్రమాలు చేపట్టింది.. మీడియా, ప్రతిపక్షాలు ఉన్నవి లేవిని చెప్తూ రైతులను గందరగోళ పరుస్తున్నాయి.. అందుకే ప్రజలకు, రైతులకు క్లారిటీ ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నాం.. రైతుభరోసా కింద వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రూ.12 వేలు ఇస్తాం.. ”భూమి లేకపోవడమే శాపమైతే.. ప్రభుత్వం తమను ఆదుకోవడం ఇంకో శాపమని పాదయాత్రలో పేదలు మా దృష్టికి తీసుకువచ్చారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించాం.. ”ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం” అని దీనికి నామకరణం చేశాం. రేషన్ కార్డులు లేని అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించాం.. జనవరి 26 నుంచి ఈ పథకాలన్నీ అమలు చేస్తాం.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతున్నందున ఈ పథకాలు ఈ రోజు నుంచే అమలు చేయాలని నిర్ణయించాం..” అని తెలిపారు.
Raithu Bharosa,Rs,12000 per Acre,CM Revanth Reddy,Ration Cards,Financial Assistance to Poor,Telangana Cabinet Decisions