బూతులు మాట్లాడిన నోటితో నీతులా?

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు ‘నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు’ అన్నట్టు ఉందంటున్ననెటీజన్లు

రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు తెరలేపిందే సీఎం రేవంత్‌ రెడ్డి. ఒక రకంగా బూతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆయన మారిపోయారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. తన అనుయాయుల చప్పట్లను చూసి మరింత రెచ్చపోయి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయాక ఇక నుంచి నా నుంచి అలాంటి మాటలు ఆశించవద్దని.. తాను మారిన మనిషిని అన్నట్లు డైలాగులు కొట్టారు. కానీ మాట మీద నిలబడితే ఆయన ఎనుముల రేవంత్‌ రెడ్డి ఎందుకు అవుతారు అనేలా ఆయన వ్యవహారశైలి ఉన్నది.

నిన్న మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ ‘విజయ తెలంగాణ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. ప్రత్యర్థులను ఎంత అవమానకరంగా, కించపరిచేలా తిట్లు తిట్టామనే రీతిలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పోటీ జరుగుతున్నదన్నారు. రాజకీయ నాయకుల ఉపన్యాసాలు వస్తే పిల్లలు టీవీలు బందుపెట్టే దుస్థితి దాపురించింది అన్నారు. ఈ ధోరణికి ముగింపు పలకాలని ఓ సూచన కూడా చేశారు. సీఎం చెప్పినవన్నీ ఆయనకే వర్తిస్తాయి. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులను సీఎం ఏ విధంగా దూషిస్తున్నారో అందరికీ తెలిసిందే. అందుకే కేసీఆర్‌ ఓ మీడియా ఛానల్‌ మాట్లాడుతూ బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదు పరిపాలన చేయడం అంటే అన్నారు. ఆయన అప్పుడు ఎందుకు అన్నారో ఈ పధ్నాలుగు నెలల రేవంత్‌ పాలన, ఆయన వ్యాఖ్యలు చూసిన ప్రజలకు అర్థమైంది. అంతెందుకు ఈ కార్యక్రమానికి ముందు యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా శివచరణ్‌ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో సీఎం మాట్లాడిన మాటలు చూస్తే రేవంత్‌ పొద్దునో మాట, మధ్యాహ్నాం ఓ మాట, సాయంత్రం మరో మాట్లాడుతారని ఇట్టే అర్థమౌతుంది.

అందుకే బూతుల సంస్కృతికి ముగింపు పలకాలన్న ముఖ్యమంత్రే అసభ్యకర వ్యాఖ్యలు మంచిది కావని, మీ పరిస్థితి ఏంటని మీరు నన్ను అడుగవచ్చు. ఆటనే ఆలా ఉంటుంది. ఆడకుంటే ఔటయ్యే పరిస్థితి . ఈ పోటీలో నేను గెలవాలనుకుంటున్నాను కాబట్టి తప్పడం లేదని లేదన్నారు. దీన్నిబట్టి సీఎం మానసిక పరిస్థితి ఎలా ఉన్నదో చూడవచ్చు. వ్యక్తిగత దూషణలు, రాజకీయాల్లోకి కుటుంబాలను తీసుకురావడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతను నోటికొచ్చినట్లు తిడుతూ కాలం వెళ్లదీస్తూ.. ఆరు గ్యారెంటీలను అటకెక్కించి డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా రోజుకో వివాదాన్ని తెరమీదికి తెచ్చిందే రేవంత్‌రెడ్డి. తెలంగాణ సమాజం తలదించుకునేలా బూతుల సంస్కృతిని మొదలుపెట్టిన ఆయనను చూసే ప్రజలు కూడా అదేస్థాయిలో తిడుతున్నారు. వారిని చూసిన తర్వాత అయినా ముఖ్యమంత్రి మారితే ఆయనకే మంచిదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

CM Revanth Reddy,Shocking Comments,In Public Meeting,Vijaya Telangana Book Launch,Congress Vs BRS