Naveen Chandra | నవీన్ చంద్రకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు

 

2024-05-01 08:21:33.0

https://www.teluguglobal.com/h-upload/2024/05/01/1323812-naveen-chandra.webp

Naveen Chandra – హీరో నవీన్ చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ అందుకున్నాడు ఈ హీరో.

హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ ఏడాది నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో నవీన్ చంద్ర ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. గత ఏడాది విడుదలైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం మంత్ ఆఫ్ మధు సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆయన అద్భుతమైన నటనకు ఈ పురస్కారం లభించింది.

సినిమా పరిశ్రమలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంత ప్రత్యేకత ఉంటుందో అందరికీ తెలుసు. అంతటి గొప్ప అవార్డు నవీన్ చంద్రకు లభించడం విశేషం.

భారతీయ చిత్ర పరిశ్రమకు పితామహుడుగా చెప్పుకోదగిన దాదాసాహెబ్ ఫాల్కే పుట్టినరోజు ఏప్రిల్ 30వ తేదీన ఈ పురస్కారాలను అందిస్తారు. ఈ పురస్కారాల కోసం దేశవ్యాప్తంగా అనేకమంది కళాకారులు పోటీ పడుతూ ఉంటారు. మనదేశంలో ప్రతి ఏడాది విడుదలయ్యే చిత్రాలు, వివిధ విభాగాలలో పోటీపడుతాయి. అందులో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి నిర్వాహకులు ఈ పురస్కారాలను అందిస్తారు. 2024 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నవీన్ చంద్రకు ఈ అవార్డు దక్కింది.

నవీన్ చంద్ర ఇప్పటి వరకు అనేక తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో నటించారు. ఆయన హీరోగా 2011లో అందాల రాక్షసి సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఆ తరువాత వరుసగా మంచి సబ్జెక్ట్ ఉన్న కథలను ఎంచుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు.

ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్ వంటి పాన్ ఇండియా చిత్రంతో పాటు అనేక చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన ఇన్స్పెక్టర్ రుషి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో సంచలనం సృష్టిస్తోంది.

 

Naveen Chandra,Dada Saheb Phalke Award,Month of Madhu movie,Colours Swathy