THE 100 | మొగలిరేకులు సాగర్ హీరోగా మరో సినిమా

 

2024-04-27 08:03:00.0

https://www.teluguglobal.com/h-upload/2024/04/27/1322599-the-100-1.webp

Sagar’s THE 100 Movie – మొగలిరేకులు సాగర్ మరో మూవీ రెడీ చేశాడు. దీని పేరు ది-100.

మొగలి రేకులు ఫేమ్ ఆర్‌కె సాగర్ అప్ కమింగ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌కి విశేష స్పందన లభించింది. పోస్టర్‌లో ఆర్‌కె సాగర్‌ను విక్రాంత్ ఐపీఎస్‌గా పరిచయం చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. చిరంజీవి తల్లి కొణిదెల అంజనా దేవి చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేశారు.

ఐపీఎస్ అధికారి విక్రాంత్ చేసిన తప్పులపై మానవ హక్కుల కమిషన్ విచారించడంతో టీజర్ ప్రారంభమైంది. నగర శివార్లలో కొన్ని సామూహిక హత్యలు జరుగుతాయి. అందులో వారంతా రౌడీ షీటర్లు. పోలీసుల విచారణ జరుగుతోంది. నేరస్థులను ఎదుర్కోవడంలో తనదైన స్టయిల్ కలిగి ఉన్న హీరో తన పద్దతి గురించి మీడియా లేదా ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోడు. అతను ఉన్నతాధికారులు, మానవ హక్కుల కమిషన్‌కు కూడా భయపడడు.

తనున్న చోట నేరాలను నిర్మూలించడానికి ఎంతకైనా తెగించే నిజాయితీ గల ఐపీఎస్ అధికారి స్వభావాన్ని తెలియజేసేలా టీజర్ ఉంది. సాగర్ ఖాకీ దుస్తుల్లో ఫిట్‌గా కనిపించాడు. పోలీస్ గా అతని పెర్ఫార్మెన్స్ బాగుంది. టీజర్‌ని బట్టి చూస్తే సినిమా గ్రిప్పింగ్ కథనంతో యాక్షన్‌ జానర్ లో తెరకెక్కినట్టు అనిపిస్తోంది.

ఆర్కే సాగర్ సరసన మిషా నారంగ్ నటిస్తున్న ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. శ్యామ్ కె నాయుడు కెమెరామెన్ కాగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.

 

Sagar,THE 100,movie teaser